దేశవ్యాప్తంగా కోట్లాది రైతులు ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) 21వ విడుత విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ విడుత నిధులు దీపావళికి ముందుగానే లేదా అక్టోబర్ చివరి వారంలో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు తక్షణ సాయం అందించేందుకు రూ.171 కోట్లను జమ్మూ కాశ్మీర్ రైతుల ఖాతాల్లో జమ చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 26న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణ రాష్ట్రాల్లోని రైతులకు రూ.540 కోట్ల నిధులు విడుదల చేశారు, దీంతో 2.7 మిలియన్ రైతులు లబ్ధి పొందారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు కూడా ఈ 21వ విడుత నిధులు త్వరలోనే విడుదల కానున్నాయి. దీపావళి పండుగ ముందు కేంద్రం నిధులను విడుదల చేసే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
PM-KISAN పథకం కింద సంవత్సరానికి రూ.6,000 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం మూడు దఫాల్లో నిధులు జమ చేస్తుంది. ఇది ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2,000 చొప్పున ఖాతాలో జమ అవుతుంది.
నిధులు పొందాలంటే తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన ప్రక్రియ
21వ విడుత నిధులు పొందాలంటే రైతులు ముందుగా e-KYC పూర్తి చేయాలి. ఇది
Common Service Center (CSC) ద్వారా లేదా
pmkisan.gov.in అధికారిక వెబ్సైట్లో పూర్తి చేయవచ్చు.
అలాగే ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయ్యి ఉండాలి, భూసమాచారం సరిగ్గా ఉందో లేదో కూడా నిర్ధారించుకోవాలి. ఈ వివరాలు సరిగా లేకపోతే రైతులు నిధులు పొందలేరు.
మీ PM-Kisan స్టేటస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి
రైతులు తమ ఖాతాకు నిధులు జమయ్యాయా లేదా తెలుసుకోవడానికి PM Kisan Beneficiary Status Check సదుపాయం కూడా ఉంది.
అధికారిక వెబ్సైట్లో ‘Farmers Corner’ → ‘Beneficiary Status’ ఆప్షన్పై క్లిక్ చేసి, ఆధార్ లేదా మొబైల్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
ఎవరికి ఈ పథకం వర్తించదు
ఈ పథకం కుటుంబంలోని ఒకరికి మాత్రమే లభిస్తుంది.
ఆదాయపన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. చిన్న, సన్నకారు రైతులకే ఈ పథకం వర్తిస్తుంది.
రైతులకు ఉపశమనం కలిగించే పథకం
ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, ఎండలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం పెద్ద ఊరటగా నిలుస్తోంది. ఇప్పటి వరకు 20 విడుతలుగా నిధులు దేశవ్యాప్తంగా విడుదల కాగా, ఈ నెలలో 21వ విడుత రైతుల ఖాతాల్లోకి చేరనుంది.


