నర్సాపూర్ (Medak News): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరోసారి ప్రయాణికులపై అదనపు భారం మోపిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా నర్సాపూర్ నుంచి మెదక్‌కి ఎక్స్‌ప్రెస్ బస్ టికెట్ రూ.70గా ఉంటే, సోమవారం మాత్రం అకస్మాత్తుగా రూ.100 వసూలు చేయడం స్థానిక ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
వర్షాల మధ్య చార్జీల పెంపు
ఇప్పటికే అతివృష్టి వర్షాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న వేళ, ఆర్టీసీ నిర్ణయం ప్రజల జేబులపై అదనపు భారంగా మారింది. ప్రత్యేక పండుగలు, ఉత్సవాలు లేదా అదనపు బస్సుల కారణం లేకపోయినా, సాధారణ రోజునే టికెట్ ధర పెంచడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ప్రయాణికుల అనుభవం
హనుమంతపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ ప్రతిరోజు పనిమీద మెదక్‌కు ప్రయాణిస్తుంటారు. “ప్రతిరోజు రూ.70 టికెట్ తీసుకుంటా. కానీ ఈరోజు రూ.100 వసూలు చేశారు. ఎందుకని అడిగితే స్పెషల్ సార్… మాకేం తెలియదు, డిపో మేనేజర్ని అడగండి అని కండక్టర్ నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు” అని ఆయన వాపోయారు. ఈ సంఘటనతో ఇతర ప్రయాణికులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
డిపో మేనేజ్మెంట్ స్పందన లేకపోవడం
ఈ ఘటనపై నర్సాపూర్ డిపో మేనేజర్ సురేఖను సంప్రదించగా ఎటువంటి స్పష్టమైన సమాధానం రాలేదు. దీంతో “ప్రభుత్వం నిలువుదోపిడీ చేస్తోంది” అంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు.
ప్రజల డిమాండ్
ప్రయాణికులు స్పష్టత కోరుతూ RTC మరియు రాష్ట్ర రవాణా శాఖ తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు ప్రజా వ్యతిరేక చర్యలుగా మిగిలిపోతాయని అంటున్నారు.


